Featured blog image

ఈ నెలలో తిరుపతి లో సుప్రభాతం ఉండదు. మరి ?

Hinduvu.Com

"మార్గళి త్తిజ్ఞల్ మది నిరైన్ద నన్నాళాల్ ...అంటూ మొదలయ్యే తిరుప్పావై పాశురాలుతో తిరుపతి ఈ మాసం అంతా మరింత శోభామయంగా మారబోతోంది. 

 ధనుర్మాసం రాగానే తిరుమలలో వేకువజాము స్వరమే మారిపోతుంది. ఏడాది పొడవునా శ్రీవేంకటేశ్వరస్వామిని మేల్కొలిపే సుప్రభాత సేవ, ఈ మాసంలో ఒక్కసారిగా నిలిచిపోతుంది. డిసెంబర్ 16 నుండి జనవరి 14 వరకు తిరుమల గర్భగుడిలో వినిపించేది సుప్రభాతం కాదు… గోదాదేవి తిరుప్పావై. అసలు ఈ నెలంతా ఎందుకు వెంకన్న సుప్రభాతం వినడు? ధనుర్మాసంలో తిరుప్పావైకే అంతటి ప్రాధాన్యం ఎందుకు అనే ప్రశ్నే ఈ ఆధ్యాత్మిక రహస్యానికి మూలం.ఈ విషయమై వైదిక స్మార్త పండితుడు జోశ్యుల విజయ రామకృష్ణ గారు ఏమంటారంటే...

వైఖానస ఆగమం ప్రకారం పూజలందుకునే తిరుమల శ్రీనివాసుడు సాధారణ రోజులలో భక్తుల సుప్రభాతంతో మేల్కొంటాడు. కానీ ధనుర్మాసం వచ్చిందంటే పరిస్థితి మారిపోతుంది. పురాణ విశ్వాసం ప్రకారం ఈ మాసంలో స్వామివారు మనకంటే ముందే నిద్రలేచి, భక్తుల కోసం వేచి ఉంటారని భావిస్తారు. అంటే మేల్కొలపాల్సిన అవసరమే ఉండదు. అలాంటి సందర్భంలో ‘నిద్రలేపే’ సుప్రభాతం తగదు. అందుకే స్వామిని కీర్తించే, ఆయన లీలలను ఆలపించే తిరుప్పావై పాశురాలు ప్రతిధ్వనిస్తాయి. ఇది కేవలం ఆచారం కాదు… భక్తి తత్త్వానికి ప్రతీక.

ధనుర్మాస ఘడియలు డిసెంబర్ 16 మధ్యాహ్నం 1 గంట 23 నిమిషాలకు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఆ మరుసటి రోజు నుంచే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదన మొదలవుతుంది. జనవరి 14న ఈ ఘడియలు ముగియడంతో మళ్లీ సుప్రభాతం తిరిగి వస్తుంది. ఈ మధ్య కాలంలో తిరుమలలో మాత్రమే కాదు, తిరుపతితో పాటు దేశవ్యాప్తంగా 233 కేంద్రాలలో తిరుప్పావై పారాయణం జరుగుతుంది. టీటీడీ ఆల్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ నెలరోజుల పాటు పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేస్తారు. ఇది ఒక ఆలయ కార్యక్రమం కాదు… దేశమంతా వ్యాపించిన ఆధ్యాత్మిక ఉద్యమం.


ఈ ధనుర్మాసంలో తిరుప్పావైకి అంతటి స్థానం రావడానికి కారణం గోదాదేవి. పన్నెండు మంది ఆళ్వార్లలో ఏకైక మహిళ అయిన ఆండాళ్, భగవంతుడిని వరుడిగా భావించి, భక్తిని జీవన మార్గంగా మలిచిన మహానుభావురాలు. ఆమె రచించిన ముప్పై పాశురాల సమాహారమే తిరుప్పావై. ప్రతి పాశురం ఒక ఉదయం లాంటిది. ఒక్కో రోజు ఒక్కో పాశురం వినిపిస్తూ, మొత్తం ముప్పై రోజులు స్వామివారు గోదాదేవి గీతాలను ఆస్వాదిస్తారని భక్తుల నమ్మకం. అందుకే దీన్ని ధనుర్మాసపు గోవింద సుప్రభాతం అని కూడా అంటారు.

తిరుమలలో ఈ పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది. సాధారణంగా భోగశ్రీనివాసమూర్తికి జరిగే ఏకాంత సేవ స్థానంలో ఈ కాలంలో శ్రీకృష్ణస్వామివారికి సేవ నిర్వహిస్తారు. గర్భగుడిలో ఉదయాన్నే తిరుప్పావై పాశురాలు వినిపిస్తే, సాయంత్రం ఆలయాల్లో ప్రవచనాలు, ఉపన్యాసాలు సాగుతాయి. తెలుగు రాష్ట్రాల్లోని నారాయణాలయాలు ఈ నెలంతా తిరుప్పావై ధ్వనితో నిండిపోతాయి. వందలాది వైష్ణవాచార్యులు, మహిళా పండితులు తిరుప్పావై అర్థతాత్పర్యాలను వివరిస్తూ భక్తులను మంత్ర ముగ్ధులను చేస్తారు.

మొత్తానికి ధనుర్మాసంలో సుప్రభాతం ఆగిపోవడం అనేది ఒక రద్దు కాదు… అది ఒక భావ మార్పు. స్వామిని నిద్రలేపే భక్తి నుంచి, స్వామి కోసం మనమే ముందుగా లేచి ఆయనను కీర్తించే స్థాయికి భక్తిని తీసుకెళ్లే ఆధ్యాత్మిక పరిణామం.

Share this post