Featured blog image

అమావాస్య రోజున బుక్ ఎగ్జిబిషన్ అంటే ధర్మవిరుద్ధమా?

Hinduvu.Com



హిందూ మతంలో అమావాస్యను చాలామంది “అశుభ దినం” గా భావిస్తారనే సంగతి తెలిసిందే. దాంతో ఈ 2025 వ సంవత్సరం పుస్తకాల ఎగ్జిబిషన్ ను అమావాస్య రోజు ప్రారంభించటం చాలా మందిలో చర్చనీయాంశంగా మారింది. అమావాస్య ప్రభావం ఎగ్జిబిషన్ లోని పుస్తకాల అమ్మకాలుపై ఉండే అవకాసం ఉందని, పుస్తక విక్రేతలు నష్టపోతారని కొందరు సోషల్ మీడియాలో వాదిస్తున్నారు. ఈ నేపధ్యంలో నిజంగానే అమావాస్య రోజున ఎగ్జిబిషన్ ను ప్రారంభించటం మంచిది కాదా? ..అసలు అమావాస్య రోజు కు కొత్త పనులు ప్రారంభించకపోవటానికి మధ్య సంభందం ఏమిటో చూద్దాం.

భారతీయ కాల గణనలో అమావాస్య అనేది ప్రతి నెలా తప్పకుండా వచ్చే ఒక తిథి. చంద్రుడు పూర్తిగా కన్పించకుండా ఉండే ఈ రోజు ని హిందూ సంస్కృతిలో చాలా కీలకమైనదిగా భావిస్తూంటారు. ఈ సందర్భంలో అనేక సంప్రదాయ భావనలు, సాధారణ నమ్మకాలు, శాస్త్రీయ దృక్కోణం అన్ని కలగలిసి ఉండటం గమనించవచ్చు. ఈ విషయంలో మనకు వేద పండితులు మహదేవ శర్మగారి అభిప్రాయం చూద్దాం.

మహదేవ శర్మగారు చెప్పేదాని ప్రకారం ..... హిందూ మతంలో అమావాస్యను చాలామంది “అశుభ దినం” గా భావిస్తారు. కానీ ఇది శాస్త్రసమ్మతమైన నిర్వచనం కాదు ,ఇది సామాజికంగా మారిన అపార్థం . వేద, ఉపనిషత్, పురాణ పరంగా చూస్తే అమావాస్యకు ఉన్న అర్థం వేరే. శాస్త్రాల్లో అమావాస్య యొక్క అసలు భావం అమావాస్య అంటే చంద్రుడు కనిపించని రోజు. కానీ హిందూ తత్త్వంలో చంద్రుడు అంటే మనసు. సూర్యుడు అంటే ఆత్మ, చైతన్యం. చంద్రుడు కనబడకపోవడం అంటే మనసు బయటకి కాకుండా లోపలికి మళ్లే స్థితి. అందుకే ఆ రోజు వేరే ఏ పనులు పెట్టుకోకుండా ఉపవాసం, ధ్యానం, పితృ తర్పణం. మౌనంగా ఉండటం... ఈ రోజున చేయమని శాస్త్రాలు చెబుతాయి. ఇది నెగెటివ్ కాదు , ఇది ఇంటర్నల్ ఫోకస్ . అలాంటి సమయంలో వేరే పనులు పెట్టుకోవద్దని చెప్తారు. కానీ కాలక్రమేణా ఆ రోజు వేరే ఏ పని చేయరాదని,పెట్టుకోరాదనే ఆలోచన స్దిరపడింది.

ఇప్పుడు అసలు ప్రశ్న: బుక్ ఎగ్జిబిషన్ ఈ కోవలోకి వస్తుందా? బుక్ ఎగ్జిబిషన్ అంటే: ఆలోచన, చదువు, ప్రశ్న, అంతర్ముఖ ప్రయాణం గుర్తుంచుకోండి... ఇది పెళ్లి కాదు, శుభముహూర్తం అవసరమైన కార్యక్రమం కాదు, భోగభాగ్యాల ప్రదర్శన కాదు. అసలు హిందూ తత్త్వానికి దగ్గరగా చూస్తే పుస్తకం అంటే సరస్వతి . సరస్వతి అంటే జ్ఞానం, జ్ఞానం అంటే మౌనం నుంచి పుట్టేది. అంటే అమావాస్య రోజు పుస్తకాలకు సంభందించిన కార్యక్రమం ప్రారంభించటం అంటే విరుద్ధం కాదు. కొన్ని తరాలుగా “అమావాస్యనాడు బయటకు పోకూడదు”, “ఖర్చు పెట్టకూడదు”, “కొత్తది మొదలుపెట్టకూడదు” అనే మాటలు వస్తూ వచ్చాయి. అవే నమ్మే వాళ్లు ఎక్కువ మంది ఉంటే ఆ రోజు బిజినెస్ తగ్గుతుంది. అంతవరకే జరుగుతుంది. అయితే ఇవేమీ పాఠక సమాజానికి అక్షరాలా వర్తించవు. అయినా హిందూ మతం ఎప్పుడూ “ఆలోచించవద్దు”, “చదవవద్దు”, “జ్ఞానం వద్దు” అని చెప్పలేదు.

 చీకటి రోజునే వెలుగుని వెతికే ప్రయత్నం అనేది హిందూ ధర్మం ఎప్పుడూ చెప్పే విషయం. కాబట్టి వెలుగుని పంచే బుక్ ఎగ్జిబిషన్ వంటి కార్యక్రమాలకు అమావస్య అడ్డం కాదు. కానేరదు

Share this post